Kolkata | కోల్‌కతా: ఒక అపరిచిత మహిళను ‘డార్లింగ్’ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని, చట్ట ప్రకారం నిందితుడు శిక్షార్హుడేనని కలకత్తా హైకోర్టు స్పష్టంచేసింది. కేసులో కింది కోర్టు నిందితుడికి విధించిన శిక్షను సమర్థించింది. నిందితుడు మద్యం మత్తులో ఉన్నా, లేకపోయినా అతడు శిక్షార్హుడేనని కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి జే సేన్‌గుప్తా పేర్కొన్నారు.
కేసు వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో దుర్గా పూజ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ తాగి అల్లరి చేస్తున్న జానక్ రామ్ అనే వ్యక్తిని అదుపు చేయడానికి ప్రయత్నించగా ‘హాయ్ డార్లింగ్.. నాకు శిక్ష వేయడానికి వచ్చావా?’ అని అసభ్యంగా మాట్లాడాడు. దీనిపై మాయాబండర్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు విచారించిన నార్త్, మిడిల్ అండమాన్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ నిందితునికి మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు అడిషనల్ సెషన్స్ కోర్టును, ఆపై హైకోర్టును ఆశ్రయించాడు.