పట్నా: ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖెమ్కా (Gopal Khemka) దారుణ హత్యకు గురయ్యారు. శుక్రర్రాత్రి 11.40 గంటల సమయంలో పట్నాలోని గాంధీ మైదాన్‌లో (Gandhi Maidan) ఉన్న తన నివాసం వద్ద కారులో నుంచి దిగుతుండగా.. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. రాష్ట్రంలో అతి పురాతన మగధ దవాఖానకు (Magadh Hospital) ఆయన యాజమానిగా వ్యవహరిస్తున్నారు. ఆరేండ్ల క్రితం ఆయన కుమారుడు గుంజన్ ఖెమ్కాను (Gunjan Khemka) కూడా దుండగులు ఇలానే హత్య చేశారు.
బంకీపోర్ క్లబ్ డైరక్టర్ కూడా అయిన గోపాల్.. శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో తన ఇంటికి చేరుకున్నారని, కారు దిగుతుండగా దుండగులు కాల్పులకు తెగబడ్డారని ఆయన సోదరుడు శంకర్ వెల్లడించారు. రాత్రి 2.30 గంటలకు గాని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోలేదని ఆరోపించారు. కాగా, ఘటనా స్థలంలో ఒక బుల్లెట్, షెల్‌ను స్వాధీనం చేసుకున్నామని పాట్నా సీనియర్ పోలీసు అధికారి దీక్షా కుమారి తెలిపారు. 11 గంటల సమయంలో తమకు హత్యకు సంబంధించిన సమాచారం అందిందని చెప్పారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
కాగా, 2018లో గోపాల్ కుమారుడు గుంజన్ ఖెమ్కా (38) కూడా హత్యకు గురయ్యారు. పట్నా శివార్లలోని వైశాలీలో ఉన్న కాటన్ ఫ్యాక్టరీ వద్ద.. గోపాల్ కారులో నుంచి దిగుతుండగా బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు.