గ్యాంగ్‌టక్: ఐఐటీ విద్యార్థులతో వెళ్తున్న బస్సుపై డ్రైవర్ అదుపుకోల్పోయాడు. దీంతో అది లోయలోకి దూసుకెళ్లింది. (Bus Falls Into Gorge) ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిక్కింలోని మంగన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఐఐటీ ధన్‌బాద్ విద్యార్థులతో వెళ్తున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దారా అటవీ ప్రాంతంలోని పక్షేప్ సమీపంలో ఆ బస్సు ప్రమాదానికి గురైంది. వంద అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది.
కాగా, బస్సు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా పది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన విద్యార్థుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో గ్యాంగ్‌టక్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. మిగతా విద్యార్థులకు మంగన్లోని హాస్పిటల్లో చికిత్స అందించినట్లు వెల్లడించారు.