న్యూఢిల్లీ: ఇటీవల సరిహద్దుల్లో ఉగ్రదాడులు పెరుగుతున్న క్రమంలో కేంద్రప్రభుత్వం శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, అతని డిప్యూటీ స్పెషల్ డీజీ (వెస్ట్) వైబీ ఖురానియాలను విధుల నుంచి తొలగించింది. వారిని సొంత రాష్ర్టాల కేడర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వేర్వేరుగా జారీ చేసిన ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని ప్రకటించింది. అగర్వాల్ 1989 కేరళ కేడర్ అధికారి కాగా, ఖురానియా ఒడిశాకు చెందిన 1990 బ్యాచ్ అధికారి. వారి తొలగింపునకు కారణాలు తెలియరాలేదు. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్‌లోకి వస్తున్న చొరబాటుదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని, వీరిని అరికట్టడంతో బీఎస్ఎఫ్ విఫలమైందని ఆరోపణలు రావడంతో కేంద్రం ఈ చర్య తీసుకున్నట్టు తెలిసింది.