బ్రిటన్ ఆర్థికమంత్రి పదవికి గుడ్‌బై
లండన్, జూలై 5: బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆర్థికమంత్రి పదవికి రిషి సునక్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రి పదవికి సాజిద్ జావిద్ కూడా రాజీనామా చేశారు. వరుస కుంభకోణాలు, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు, నిందితులకు రక్షణగా నిలబడటం వంటి చర్యలను వ్యతిరేకిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సునక్, జావిద్ వెల్లడించారు. ‘తాము ఎన్నుకున్న ప్రభుత్వం సమర్థంగా, నమ్మకంగా పనిచేయాలని కోరుకోవడం ప్రజల హక్కు. అయితే, అలా జరుగడంలేదు. ప్రభుత్వాన్ని వీడటం బాధగా ఉంది.
అయితే భిన్నమైన మనస్తత్వాలు ఉన్నప్పుడు కలిసి కొనసాగలేము’ అని సునక్ పేర్కొన్నారు. జాతి ప్రయోజనాలను నిలబెడుతూ, ప్రజలకు ఆమోదయోగ్య పాలన అందించడంలో బోరిస్ సఫలం అవుతారని తాను నమ్మడం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు జావిద్ ప్రకటించారు. లైంగిక ఆరోపణల కారణంగా ఎంపీ క్రిస్ పించర్ ఇటీవలే పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ని డిప్యూటీ చీఫ్ విప్‌గా బోరిస్ నియమించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కళంకితుడైన వ్యక్తిని ఎలా ఆ పదవిలో నియమిస్తారని ఉద్యోగులు, చట్టసభ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై బోరిస్ క్షమాపణలు చెప్పినప్పటికీ జరుగాల్సిన నష్టం జరిగిపోయింది.