అహ్మదాబాద్ : పెండ్లి వేడుకలో వరుడి వీడియో (viral video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడికి సిగరెట్ వెలిగించి పెండ్లి వేడుకకు వధువు తల్లితండ్రులు ఆహ్వానిస్తున్న వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. బ్లాగర్ జుహీ కే పటేల్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 57 లక్షల మంది వీక్షించారు.
ఈ వీడియోలో వరుడు కూర్చుని ఉండగా అత్తా మామలు అతడికి సిగరెట్ అందించి వారే వెలిగించడం కనిపిస్తుంది. ఈ పెండ్లి వేడుకకు అతిధిగా హాజరైన జుహీ ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. పెండ్లి కొడుకును స్వీట్లు, బీడీ, పాన్‌తో అత్తగారు స్వాగతించిన పెండ్లి వేడుకను ఇప్పుడే చూశానని ఆమె రాసుకొచ్చారు.
దక్షిణ గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో అనుసరించే పాత సంప్రదాయం ఇదని, అతడు కనీసం పొగతాగలేదని, వీడియోలో వారు కేవలం ఆచారం కోసం నటించారని చెప్పుకొచ్చారు. ఈ ఆచారంపై నెటిజన్లు పెదవివిరిచారు. అసలు ఇదేం సంప్రదాయమని మరికొందరు నొసలు చిట్లించారు. అయితే బిహార్, ఒడిషాలోనూ ఇలాంటి సంప్రదాయం ఉందని మరికొందరు యూజర్లు కామెంట్ చేశారు.