జమ్ము/కోల్‌కతా/న్యూఢిల్లీ, జూలై 16: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. తాజాగా దోడాజిల్లాలో భద్రతా బలగాలు సోమవారం చేపట్టిన ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో ఒక ఆఫీసర్‌తో సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు. మరణించిన వాళ్లలో డార్జిలింగ్‌కు చెందిన కెప్టెన్ బ్రిజేశ్ థాపా, ఏపీకి చెందిన నాయక్ డీ రాజేశ్, రాజస్థాన్‌కు చెందిన సిపాయిలు బిజేంద్ర, అజయ్ కుమార్ సింగ్ ఉన్నారని ఆర్మీ అధికారులు మంగళవారం వెల్లడించారు. దాడి తామే చేశామని పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ సంస్థకు షాడో గ్రూపు ‘ది కశ్మీర్ టైగర్స్’ ప్రకటించింది. ఉగ్రవాదులు దోడా జిల్లాలోని దేసా ఏరియా అడవుల్లో దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సోమవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో తారసపడిన టెర్రరిస్టులకు ఎదురు కాల్పులకు పాల్పడ్డారని ఆర్మీ 16 కార్ప్స్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది. ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడగా, వీరిలో నలుగురు మరణించారని అధికారులు తెలిపారు. జమ్ము రీజియన్‌లో గత 32 నెలల వ్యవధిలో ఉగ్రదాడుల్లో 48 మంది ఆర్మీ జవాన్లు మరణించారు.
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సోమవారం ఉగ్రవాదుల దాడిలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం వల్లభరాయుడు పేట గ్రామానికి చెందిన హవిల్దార్ ఎస్ జగదీశ్వర్ రావు మరణించారు. జగదీశ్వర్‌రావు 11 రాష్ట్రీయ రైఫిల్స్‌లో భాగంగా 2003లో ఆర్మీలో చేరారు.
గత కొన్నేండ్లుగా ప్రశాంతంగా ఉన్న జమ్ము రీజియన్‌లో గత నెల రోజులుగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. జమ్ము రీజియన్‌లో 2021 నుంచి 52 మంది భద్రతా సిబ్బంది సహా 70 మంది మరణించారు.కాగా, విదేశీ ఉగ్రవాదులను అంతమొంతించేందుకు జమ్ముకశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు చేపడుతున్నట్టు ఆర్మీ తెలిపింది.
కేంద్రంలోని అధికార బీజేపీ తప్పుడు విధానాల కారణంగా ఆర్మీ జవాన్లు, వారి కుటుంబాలు బలవుతున్నాయని విపక్షాలు విమర్శించాయి. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. డీజీపీని తొలగించాలని పీడీపీ చీఫ్ ముఫ్తీ కోరగా, ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో మోదీ విఫలమయ్యారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
దేశం కోసం తన కుమారుడు ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉన్నదని దోడా ఉగ్రదాడిలో మరణించిన ఆర్మీ కెప్టెన్ బ్రిజేశ్ థాపా తండ్రి భువనేశ్ కే థాపా అన్నారు. తన కుమారుడు దేశంలో ఆర్మీ డే జరుపుకొనే జనవరి 15న జన్మించాడని తెలిపారు. భువనేశ్ కూడా ఆర్మీలో కర్నల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. తన కుమారుడు తనను చూసి స్ఫూర్తి పొందాడని, సైన్యంలో చేరాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాడని పేర్కొన్నారు. ‘నా కుమారుడిని చూసి నాకు గర్వంగా ఉన్నది’ అని ఆ రిటైర్డ్ ఆర్మీ అధికారి ఉద్వేగంతో అన్నారు. ఆర్మీ ఆపరేషన్లలో చాలా రిస్క్ ఉంటుందని, రిస్క్ ఎలా ఉన్నప్పటికీ జవాన్ నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుందని భువనేశ్ పేర్కొన్నారు.