DCGI | న్యూఢిల్లీ, జనవరి 4: దవాఖానలు, బ్లడ్ బ్యాంకులు రక్తానికి సంబంధించి కేవలం ప్రాసెసింగ్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సూచించింది. అత్యంత విలువైన రక్తాన్ని ఉచితంగా అందించాలన్నదే మనందరి అభిమతమని తెలిపింది. కానీ కొన్ని దవాఖానలు, బ్లడ్ బ్యాంకులు రకరకాల చార్జీలు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విధానానికి స్వస్తి పలకాలని కోరింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను పంపింది.
గత సెప్టెంబర్లో జరిగిన డ్రగ్స్ కన్సల్టెటివ్ కమిటీ సమావేశంలో కూడా బ్లడ్ ప్రస్తావన వచ్చిందని డీసీజీఐ వెల్లడించింది. ప్రాణాధార అయిన రక్తాన్ని అమ్మడం, ఎక్కువ చార్జీలు వసూలు చేయడం సరికాదని కమిటీ అభిప్రాయపడినట్టు పేర్కొంది. దవాఖానలు, బ్లడ్ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు వరకే పరిమితం కావాలని కమిటీ కోరినట్టు తెలిపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బ్లడ్, బ్లడ్ కాంపోనెంట్స్కు రూ.250 నుంచి రూ.1,550 వరకు ప్రాసెసింగ్ ఫీజు సరిపోతుందని డీసీజీఐ వెల్లడించింది. అందరూ ఈ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ఆదేశించింది. ఓ అధికారి స్పందిస్తూ ప్రస్తుతం ప్రైవేటు దవాఖానలు రక్తానికి ఫీజుల రూపంలో భారీగా వసూలు చేస్తున్నాయని చెప్పారు.