కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పేలుడు సంభవించింది. (Blast in Kolkata) ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించే వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నది. ఆ ప్రాంతమంతా తనిఖీ చేసింది. శనివారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో సెంట్రల్ కోల్‌కతాలోని బ్లాచ్‌మన్ స్ట్రీట్, ఎస్ఎన్ బెనర్జీ రోడ్ కూడలిలో పేలుడు జరిగింది. చెత్త ఏరుకునే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తిని 58 ఏళ్ల బాపి దాస్‌గా గుర్తించారు.
కాగా, పేలుడు సంభవించిన బ్లాచ్‌మన్ స్ట్రీట్ ప్రవేశం వద్ద ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్‌ను కొందరు వ్యక్తులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని మూసివేశారు.
బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీమ్‌ను అక్కడకు రప్పించారు. అనుమానాస్పద బ్యాగ్‌తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
మరోవైపు కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై ఒకవైపు జూనియర్ డాక్టర్లు ఉధృతంగా నిరసన చేస్తున్నారు. ఈ తరుణంలో కోల్‌కతాలో పేలుడు సంఘటన జరుగడం మరోసారి కలకలం రేపింది. ఈ నేపథ్యంలో బెంగాల్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఈ సంఘటనపై స్పందించారు. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)తో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని విమర్శించారు. హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న సీఎం మమతా బెనర్జీ విఫలమయ్యారని, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.