ముంబై, ఆగస్టు 6: బీజేపీ మాజీ అధికార ప్రతినిధిని బాంబే హైకోర్టు జడ్జీగా నియమించడం మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఒక రాజకీయ నేతను న్యాయమూర్తిగా నియమిస్తే సామాన్యుడికి న్యాయం ఎక్కడ లభిస్తుందని విపక్ష నేతలు విమర్శిస్తుండగా, గతంలో కాంగ్రెస్ హయాంలోనూ ఇటువంటి నియామకం జరిగిందని, అప్పుడు అది ఒప్పయినప్పుడు ఇప్పుడెలా తప్పవుతుందని బీజేపీ ప్రశ్నిస్తున్నది. బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన లాయర్ ఆర్తీ సాథేను కొలీజియం ఇటీవల బాంబే హైకోర్టు జడ్జీగా నియమించింది. దీనిపై ఎన్సీపీ (ఎస్పీ) ఎంఎల్ఏ రోహిత్ పవార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సాథే 2023 ఫిబ్రవరి 2న బీజేపీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారని తెలిపారు. ఆమె నియామకం ‘ప్రజాస్వామ్యానికి అతి పెద్ద దెబ్బ’గా ఆయన పేర్కొన్నారు. ఒక రాజకీయ నేతను న్యాయమూర్తిగా నియమిస్తే ఆ వ్యవస్థ వెలువరించే మొత్తం తీర్పులపైనే సందేహాలు ఏర్పడతాయని అన్నారు. అంతేకాకుండా రాజ్యాంగం నిర్దేశించిన అధికార విభజన సూత్రాన్ని కూడా బలహీన పరుస్తుందని అన్నారు. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థను రాజకీయ క్షేత్రంగా మార్చే ప్రయత్నం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఒక రాజకీయ నాయకురాలిని న్యాయమూర్తిగా నియమించడం రాజ్యాంగానికి ద్రోహం చేయడం కంటే తక్కువ కాదన్నారు.
క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ఒక వ్యక్తి న్యాయమూర్తిగా నియమితులైతే వారు ఇచ్చే తీర్పులు నిష్పక్షపాతంగా ఉండకపోవచ్చునని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ పేర్కొన్నారు. 2014 నుంచి ఒక పథకం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ వస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఎన్నికల సంఘం సహా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నీ ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుస్తున్నాయని ఆరోపించారు.సాథే మాట్లాడుతూ తాను ఒకప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన మాట నిజమేనని అంగీకరించారు. అయితే తర్వాత ఆ పదవికి రాజీనామా చేశానన్నారు.