న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఏడాదిలో రెండోసారి వియత్నాంకు వెళ్లడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘రాహుల్ గాంధీ హోలీ పండుగ సమయంలో వియత్నాంలో ఉన్నట్లు తెలిసింది. నూతన సంవత్సర వేడుకల సమయంలో కూడా ఆయన ఆ దేశంలో ఉన్నారు.
ఆయన తన నియోజకవర్గంలో కన్నా వియత్నాంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. వియత్నాం అంటే అంత ప్రేమ ఎందుకో ఆయన వివరించాలి’ అన్నారు. రాహుల్ పదే పదే వియత్నాంకు వెళ్తుండటం చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణానంతరం దేశం జాతీయ సంతాప దినాలను పాటిస్తున్న సమయంలో రాహుల్ వియత్నాం వెళ్లారు.