Kangana Ranaut | న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ తనను కలుసుకోవాలనుకునే సందర్శకులు, నియోజకవర్గ ప్రజలకు కొత్త ఆంక్షలు విధించారు. తనను కలవడానికి వచ్చే వారు తమతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని, తనను ఎందుకు కలవాలనుకుంటున్నారో ఒక పేపర్‌పై రాసి ఇవ్వాలని పేర్కొన్నారు.
దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడగా, కంగన మాత్రం తన చర్యలను సమర్థించుకున్నారు. హిమాచల్‌కు నిత్యం వేలాది మంది టూరిస్టులు వస్తుంటారని, వారిలో చాలామంది కేవలం తనను చూడాలనుకుంటారని, అందువల్ల తనను కలవడానికి వచ్చిన వారిలో మండీ నియోజకవర్గానికి చెందినవారెవరో తెలుసుకోవడానికే తాను ఆధార్‌తో పాటు, ఇతర వివరాలు అడుగుతున్నానని చెప్పారు.
కంగనా ఆంక్షలను రాష్ట్ర మంత్రి, ఇటీవల ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ తీవ్రంగా విమర్శించారు. తన దగ్గరకు రావాలనుకుంటున్న ప్రజలకు ఎలాంటి ఆంక్షలు లేవని, నేరుగా వచ్చి తనను కలవవచ్చని ఆయన తెలిపారు.