BJP MLA Shot | మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే, బీజీపీ వర్గం మధ్య కాల్పులు చోటు చేసుకున్నది. షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ కాల్పులు జరిపారు. అయితే, ఓ భూ వివాదం కేసులో ఈ కాల్పులు జరిగినట్లుగా తెలుస్తున్నది. కాల్పుల్లో ప్రాణాపాయం తప్పింది. కాల్పులకు పాల్పడ్డ ఎమ్మెల్యే గణ్‌పత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటన పోలీస్‌స్టేషన్‌లో జరుగడం కొసమెరుపు.
వివరాల్లోకి వెళితే.. ఓ భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో థానేలోని ఉల్హాస్నగర్ హిల్‌లైన్ పోలీస్‌స్టేషన్‌కు ఇరువర్గాలకు చెందిన నేతలు వెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ తనయుడు, ఏక్నాథ్ షిండే శివసేన నేత మహేశ్ గైక్వాడ్ సహా మరికొందరు నేతలు ఠాణాకు చేరుకున్నారు. కొంత సేపటి తర్వాత ఎమ్మెల్యే గణ్‌పత్ ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు.
దీంతో షాక్‌కు గురైన అందరూ తప్పించుకునేందుకు యత్నించారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డాడు. ఘటనలో మహేశ్ గైక్వాడ్‌తో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను థానేలోని ఓ ఆసుపత్రికి.. అక్కడికి మరో ఆసుపత్రికి తరలించారు. కాల్పులపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు. తన కొడుకుని కళ్లెదుటే పోలీసు స్టేషన్లో కొడుతుంటే చూసి తట్టుకోలేకపోయానని.. అందుకే కాల్పులు జరిపినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎం ఏక్నాథ్ షిండేపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మరాఠాలో రౌడీరాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉద్దవ్ ఠాక్రేను వెన్నుపోటు పొడిచినట్టే బీజేపీకి సైతం ద్రోహం చేస్తారని విమర్శించారు. ఏక్నాథ్ షిండే తన వద్ద నుంచి కోట్లాది విలువైన డబ్బును అప్పుగా తీసుకున్నారన్నారు. కాల్పుల అనంతరం గణ్‌పత్ గైక్వాడ్ నుంచి పోలీసులు గన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గణ్‌పత్ గైక్వాడ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీస్‌స్టేషన్‌లో హాజరుపరుచగా.. జిల్లా కోర్టు ఈ నెల 14 వరకు రిమాండ్ విధించింది.