Kyunki Saas Bhi Kabhi Bahu Thi2 | కేంద్ర మాజీ మంత్రి, నటి స్మృతి ఇరానీ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రముఖ హిందీ సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2)లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. దాదాపు మూడు ఎపిసోడ్లలో బిల్గేట్స్ నటించబోతున్నాడు. అయితే బిల్గేట్స్ నేరుగా సెట్లో కనిపించకుండా, వీడియో కాల్ ద్వారా స్మృతి ఇరానీ (తులసి విరానీ పాత్ర)తో సంభాషించనున్నట్లు సమాచారం.
గర్భిణులు, శిశువుల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కథాంశం ముఖ్య ఉద్దేశం. బిల్గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో చురుకుగా పనిచేస్తున్నందున, సామాజిక సందేశాన్ని బలంగా చెప్పడానికి ఈ సహకారం ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ టెలివిజన్ వేదికను ఉపయోగించి ప్రజలకు ఆరోగ్యం, సామాజిక అంశాలపై అవగాహన పెంచాలని స్మృతి ఇరానీ కోరుకున్నట్లు తెలుస్తోంది.