ముంబై: యాపిల్ కంపెనీ మరో 10 రోజుల్లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా లాంచింగ్ చేయనుంది. ఈ నెల 12న యాపిల్ నిర్వహించబోయే మెగా ఈవెంట్లో ఈ ఐఫోన్ లాంచింగ్ జరగనుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ అల్ట్రా 2 స్మార్ట్‌వాచ్‌లతో పాటు మరిన్ని ఉత్పత్తులను కూడా లాంచ్ ఈవెంట్లో యాపిల్ కంపెనీ ప్రదర్శనచనుంది.
అయితే, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి రాబోతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ తన ఐఫోన్ 13 ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌పై ఐఫోన్ 13 ఫోన్లు లభించనున్నాయి. గతంలో ఐఫోన్ 13 ధర రూ. 69,900 కాగా, ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ. 58,999కే లభిస్తోంది. అంటే ఈ ఫోన్ ధర రూ. 10,901 తగ్గింది.
అంతేగాక బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఐఫోన్ 13ను ఇంకా తక్కువ ధరకు కూడా కొనుగోలు చేయవచ్చు. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే మరో రూ.3 వేలు డిస్కౌంట్ పొందొచ్చు. అంటే ఆఫర్పోనూ రూ. 55,999కే ఫోన్ లభిస్తుంది. అయితే అమెజాన్‌లో ప్రస్తుతం కార్డు ఆఫర్స్ అందుబాటులో లేవు. కానీ, ఐఫోన్ 13ను కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని చెప్పవచ్చు.