Bengalore : ప్రేమించాలని ఓ మహిళ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (Sub Inspector) కు ప్రపోజ్ చేసింది. ఆయన అందుకు అంగీకరించకపోయినా వెంటపడింది. నిత్యం ఫోన్లు చేసి వేధించింది. అయినా ఎస్సై పట్టించుకోలేదు. దాంతో ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రక్తంతో రాసిన ప్రేమ లేఖ ఇచ్చింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు నన్ను ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దాంతో ఆ ఎస్సై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామ్మూర్తినగర్ పోలీస్‌స్టేషన్‌లో సతీష్ అనే వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అదే ఏరియాకు చెందిన ఓ మహిళ సతీష్‌కు ఫోన్‌చేసి తనను తాను పరిచయం చేసుకుంది. తాను కూడా రామ్మూర్తినగర్లోనే ఉంటానని, తన పేరు సంజన అలియాస్ వనజ అని పరిచయం చేసుకుంది. ఆ తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు కూడా నన్ను ప్రేమించాలని కోరింది.
దాంతో ఆ మహిళ ప్రాంక్ చేస్తుందని భావించిన ఎస్సై సతీష్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమె నిత్యం ఫోన్ చేయడం మొదలుపెట్టింది. ఎన్ని నెంబర్లు బ్లాక్ చేసినా ఆమె మరో కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసి తనను ప్రేమించాలని వేధించసాగింది. తనకు చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలుసని, తన మాట వినకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని బెదిరించింది. పలువురు పొలిటికల్ లీడర్లతో దిగిన ఫొటోలను అతడికి పంపింది.
అయినా ఎస్సై సతీష్ పట్టించుకోలేదు. ఈ క్రమంలో కర్ణాటక హోంమంత్రి కార్యాలయం నుంచి, డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఎస్సై సతీష్‌కు ఫోన్ కాల్స్ వచ్చాయి. సంజన అనే మహిళ ఫిర్యాదు చేసేందుకు వస్తే మీరు తీసుకోలేదని ఫిర్యాదు అందిందని, ఆమె ఫిర్యాదును ఎందుకు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. దాంతో సదరు మహిళ తమ పోలీస్‌స్టేషన్‌కు రాలేదని, ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అతడు బదులిచ్చాడు.
అయినా అతడికి మహిళ నుంచి వేధింపులు ఆగలేదు. ఓ రోజు ఎస్సై సతీష్ లేని సమయంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, సిబ్బందికి అతడి బంధువును అని చెప్పి పూల బొకే, స్వీట్ బాక్స్‌ను ఇచ్చి వెళ్లింది. దాంతో ఎస్సై ఫోన్ చేసి మరోసారి ఇలాంటి పని చేయవద్దని మహిళకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆమె వేధింపులు ఆపలేదు. మరో రోజు ఎస్సై సతీష్ స్టేషన్లో ఉండగానే స్టేషన్లోకి వెళ్లింది.
అతడి ఫిర్యాదు దారులతో మాట్లాడుతుండగా ఓ ఎన్వలప్ కవర్ అతడి చేతికి ఇచ్చింది. అందులో మూడు లేఖలు, ఒక నెక్సిటో ప్లస్ టాబ్లెట్స్ స్ట్రిప్ ఉన్నాయి. ఆ లేఖల్లో ఒక ప్రేమ లేఖ కూడా ఉంది. అందులో ‘చిన్ని లవ్ యూ.. యూ లవ్ మీ (Chinni love you, you love me)’ అని ఎరుపు రంగులో రాసి ఉంది. ఈ సందర్భంగా ఆ మహిళ ‘ఆ అక్షరాలను నా సొంత రక్తంతో రాశాను’ అని చెప్పింది. మరో లేఖలో తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని పేర్కొంది.
దాంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్సై సతీష్ సదరు మహిళపై పోలీసులకు అధికారికంగా కంప్లెయింట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.