సమస్తిపూర్: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన బెంగళూరు టెకీ అతుల్ సుభాశ్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య నిఖిత, అత్త, బావమరిదిని కర్ణాటక పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీనిపై సుభాశ్ తండ్రి పవన్ కుమార్ ఆదివారం స్పందించారు. తమకు న్యాయం జరిగే వరకు తమ కుమారుడి చితా భస్మాన్ని నీళ్లలో కలపమని ప్రకటించారు.
‘నా కొడుకును వేధించిన వాళ్లంతా శిక్ష అనుభవించాలి. అప్పుడే నా కొడుక్కి న్యాయం జరిగి, అతడి ఆత్మ శాంతిస్తుంది. అంత వరకు అతడి చితా భస్మాన్ని గంగలో కలపను’ అని ఆయన మీడియాకు తెలిపారు. ఈ కేసులో ప్రధాని మోదీ, సంబంధిత అధికారులు జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘నా కొడుకు హృదయం ముక్కలైంది. భార్య, అత్త ఎంతగానో వేధించినా.. ఆ విషయాన్ని అతడెవరికీ చెప్పలేదు. తన కొడుకుని మా కస్టడీకి అప్పగించాలని సుభాశ్ సూసైడ్ నోట్లో కోరాడు’ అని ఆయన తెలిపారు.