Mamata Banerjee : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన పీజీ ట్రెయినీ డాక్టర్ హత్యపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి తీవ్రంగా స్పందించారు. అవసరమైతే హంతకుడికి ఉరి శిక్ష వేయించడానికి కూడా తమ ప్రభుత్వం వెనుకాడదని చెప్పారు. దీనిని ఓ దురదృష్టకర ఘటనగా ఆమె అభివర్ణించారు. బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి ఓదార్చి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
‘ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిర్వహించాలని అధికారులను ఆదేశించా. హంతకుడికి కచ్చితంగా కఠిన శిక్ష పడాలి. ఇప్పుడు ఆందోళన చేస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే కచ్చితంగా ఇతర లాఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని ఆశ్రయించొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఏరకంగా అయినా సరే హంతకుడికి కఠిన శిక్షపడాలి. నిరసన తెలుపుతున్న డాక్టర్లు పేషంట్లకు చికిత్స అందించాలి. మాకు ఎంత బాధ్యత ఉంటుందో ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కూడా అంతే బాధ్యత ఉంటుంది. అవసరమైతే వారి నిర్లక్ష్యంపై కూడా దర్యాప్తు చేపడతాం’ అని మమత చెప్పారు.
ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. పార్టీ ప్రతినిధి అగ్నిమిత్ర పౌల్ మాట్లాడుతూ ఆమెపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారన్నారు. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కాగా కోల్‌కతాలో ఓ జూనియర్ వైద్యురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఆమెపై లైంగిక దాడిచేసి హతమార్చినట్లు ప్రాథమిక శవపరీక్షలో నిర్ధారణ అయ్యింది.
పీజీ సెకండియర్ చదువుతున్న ఆ జూనియర్ వైద్యురాలు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఆమె మర్మాంగాలు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం జరిగినట్లు శవపరీక్షలో తేలింది. శరీరంపై వివిధ చోట్ల గాయాలు కనిపించాయి. శుక్రవారం తెల్లవారుజామున 3-6 గంటల మధ్య ఆమె హత్యకు గురై ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ కేసుకు సంబంధం ఉందన్న అనుమానంతో ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో స్వేచ్ఛగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. పైగా ఆస్పత్రితో సదరు వ్యక్తికి ఏ సంబంధం లేదు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. అతడు నేరంలో పాల్గొన్నట్లు అనుమానాలున్నాయని పోలీసులు వెల్లడించారు.