భోపాల్, జూన్ 23: అకౌంట్లలో డబ్బులు డిపాజిట్‌కు ముందే ఫోన్లకు ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. నగదు డిపాజిట్ కాకపోయినా జమ అయినట్టు లబ్ధిదారులకు సమాచారం అందుతున్నది. ఇదంతా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న తంతు. ప్రచారార్భటమే తప్ప పథకాల అమలులో చిత్తశుద్ధి లేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిరూపించుకుంది. ఇటీవల మధ్యప్రదేశ్ లాడ్లీ బెహనా యోజనాను తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా మహిళా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా నగదు జమవుతుంది. తమ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ కాకుండానే ఫోన్లకు సమాచారం వచ్చిందని సుమారు 2 వేల మంది అధికారులకు ఫిర్యాదులు చేశారు. నగదు జమ చేయకుండానే ఎస్ఎంఎస్లు పంపిస్తున్న ప్రభుత్వ తీరుపై లబ్ధిదారు శకుంతల సేన్ విమర్శలు గుప్పించారు. బోగస్ అకౌంట్ల ద్వారా తమ సొమ్మును కాజేశారని మరో మహిళ రాధ సోని ఆరోపించారు. కౌశల్ వికాస్ యోజనలో అకౌంట్లు ఓపెన్ చేసుకున్న వారికే ఈ సమస్య ఎదురైనట్టు సత్నా జిల్లా కలెక్టర్ అనురాగ్ వర్మ వివరించారు.