లక్నో: సామాజిక మాధ్యమాల్లో (Social Media) పాకిస్థాన్ అనుకూల నినాదాలు పోస్టు చేసిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని బరేలీలో ఉన్న నవాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్లో పాకిస్థాన్ జిందాబాద్ అని రాసి పోస్టు చేశాడు. అదికాస్తా వివాదానికి దారితీసింది. తమ మనోభావాలు దెబ్బతీసేలా పోస్టు చేశాడంతూ వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆధారాలను సేకరించిన తర్వాత ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల మనోభావాలను కించపరిచేలా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పాకిస్థాన్ జిదాబాద్ అంటూ స్లోగన్‌ను పోస్టు చేసినందుకు అతడిని అరెస్టు చేశామని బరేలీ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ శర్మ తెలిపారు. ఈ ఘటనలో దర్యాప్తు కొనసాగతున్నదని వెల్లడించారు.