చిత్తోర్‌ఘడ్: రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘడ్‌కు చెందిన వ్యాపారవేత్త కన్హయ్యలాల్ ఖాతిక్ కు బెదిరింపులు(Extortion) వచ్చాయి. చిత్తోర్‌ఘడ్ బప్పిలహరిగా గుర్తింపు పొందిన ఆ వ్యక్తి తన మెడలో ఎప్పుడూ బంగారు ఆభరణాలు వేసుకుని తిరుగుతుంటాడు. సుమారు 3.5 కేజీల బంగారంతో అతను సంచరిస్తూ ఉంటాడు. పండ్ల వ్యాపారం చేసే కన్హయ్యలాల్‌కు గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదార గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం రెండు రోజుల క్రితం ఖాతిక్కు ఓ మిస్ కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆ నెంబర్ నుంచే వాట్సాప్ కాల్ చేశారు. ఆ కాల్ రిసీవ్ చేసుకోకపోవడంతో .. ఆడియో మెసేజ్ చేశారు. 5 కోట్లు ఇవ్వాలంటూ ఆ మెసేజ్‌లో డిమాండ్ చేశారు.
ఒకవేళ డబ్బులు చెల్లించకుంటే బంగారు ఆభరణాలు ధరించేందుకు అవకాశం ఉండదని ఆ మెసేజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. వీలైనంత త్వరగా మ్యాటర్‌ను సెటిల్ చేయాలన్నారు. డబ్బులు డిమాండ్ చేస్తూ మరోసారి కూడా తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఖాతిక్ తెలిపాడు. సిటీ కోత్వాల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తోపుడు బండిపై ఒకప్పుడు కూరగాయలు అమ్మిన కన్హయ్యలాల్.. ఆ తర్వాత పండ్ల వ్యాపారం చేసి డెవలప్ అయ్యాడు.
యాపిల్స్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. ఆ క్రమంలో అతను బంగారు ఆభరణాలపై మోజు పెంచుకున్నాడు. అతను 3.5 కేజీల బంగారాన్ని ధరిస్తూ… చిత్తోర్‌ఘడ్ గోల్డ్‌మ్యాన్‌గా గుర్తింపు పొందాడు.
గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదార.. బికనీర్ రెసిడెంట్. ప్రస్తుతం అతను కెనడాలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోని పలు పోలీసు స్టేషన్లలో అతనిపై 32 కేసులు నమోదు అయ్యాయి. రాజస్థాన్‌లో వ్యాపారవేత్తల నుంచి అతను డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.