Ban on Soaps : నదులు (Rivers), సరస్సులు (Lakes), ఇతర నీటి వనరుల దగ్గర కాలుష్యాన్ని నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా నీటి వనరులకు 500 మీటర్ల పరిధిలో సబ్బులు (Soaps), షాంపుల (Sampoos) విక్రయాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర పర్యావరణ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ కండ్రే (Eshwar Kandre) ఆదేశాలు జారీ చేశారు. అధికారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ..‘యూజ్ అండ్ త్రో సంస్కృతి’ ప్రబలంగా ఉందన్నారు.
దేవాలయాల సమీపంలోని నదులను సందర్శించే భక్తులు స్నానాలు ఆచరిస్తారని, షాంపూ ప్యాకెట్లు, వాడేసిన సబ్బులను నీటి వనరుల వద్ద వదిలేస్తారని చెప్పారు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లోని నదులు, సరస్సులు, ఇతర నీటి వనరులకు 500 మీటర్ల పరిధిలో సబ్బులు, షాంపూలు కాలుష్యానికి కారణమయ్యే ఇతర వస్తువుల విక్రయాలు చేపట్టకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా భక్తులు తమ దుస్తులను నీటిలో వదిలేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.