జోధ్‌పూర్, ఆగస్టు 25: పాఠశాల క్యాంటీన్లు, పాఠశాల గేట్లకు 50 మీటర్ల పరిధిలో కార్బొనేటెడ్ పానీయాలు, చిప్స్, ఇతర జంక్ ఫుడ్ల విక్రయాలను రాజస్థాన్ హైకోర్టు నిషేధించింది. సమతుల్య ఆహారం, పోషకాహారానికి సంబంధించి పలు ఆదేశాలు జారీచేసిన హైకోర్టు పరీక్ష పేపర్ల లీకేజ్‌లు, పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ టైమ్, గ్రామీణ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
జెన్ జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను తీర్చిదిద్దాల్సిన ప్రాథమిక విద్యా వ్యవస్థలో ఉన్న వ్యవస్థాగత లోపాలను కోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకుంది. జస్టిస్ అనుప్ కుమార్ ధండ్ నేతృత్వంలోని జోధ్‌పూర్ బెంచ్ పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ, న్యూట్రిషన్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. క్యాంటీన్లలో ఆహార పదార్థాల క్యాలరీలు, వాటిలో ఉపయోగించిన పదార్థాలు, పోషక విలువల వివరాలతో కూడిన మెనూ బోర్డులను ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజన పథకం సమతుల్య ఆహార మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని పేర్కొంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాజస్థాన్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లకు కోర్టు నోటీసులు జారీచేసింది. 8 వారాల్లోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. ఒకవైపు దేశం 2047 నాటికి అంటే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి, ఆ తర్వాత కూడా భారత్‌ను ముందుకు నడిపించేందుకు జెన్ జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను సిద్ధం చేస్తున్నదని, మరోవైపు ము ఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికీ వ్యవస్థాగత లోపాలతో బాధపడుతున్నాయని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జెన్ జీగా, 2013 నుంచి 2024 మధ్య పుట్టిన వారిని జెన్ ఆల్ఫాగా, 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలను జెన్ బీటాగా వ్యవహరిస్తారు.