ముంబై: ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న బ్యాటర్ బాల్‌ను గట్టిగా కొట్టాడు. పక్కనే మరో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న వ్యక్తి తలకు ఆ బాల్ తగిలింది. ఈ నేపథ్యంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆ వ్యక్తి మరణించాడు. (cricketer dies) ఎవరూ ఊహించని ఈ అసాధారణ సంఘటనకు మిగతా క్రికెట్ ప్లేయర్లు షాక్ అయ్యారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. సోమవారం మాతుంగా మేజర్ దాడ్కర్ గ్రౌండ్లో దాదర్ యూనియన్ స్పోర్ట్ క్లబ్‌కు చెందిన కుచ్చి కమ్యూనిటీ పెద్దలకు క్రికెట్ మ్యాచ్ జరిగింది. 52 ఏళ్ల జయేష్ సావ్లా ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ గ్రౌండ్ అంచులో అతడు నిల్చొని ఉన్నాడు.
కాగా, సమీపంలోని దాదర్ పార్సీ కాలనీ గ్రౌండ్లో కూడా కొందరు క్రికెట్ ఆడారు. అక్కడి బ్యాటర్ బాల్‌ను గట్టిగా హిట్ చేశాడు. దాడ్కర్ గ్రౌండ్ క్రికెట్ ఆటలో ఫీల్డింగ్ చేస్తున్న జయేష్ సావ్లా తల వెనక ఆ బాల్ గట్టిగా తగిలింది. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. భయాందర్ ప్రాంతానికి చెందిన మృతుడు జయేష్ సావ్వా, వ్యాపారవేత్త అని మిగతా క్రికెట్ ప్లేయర్స్ తెలిపారు. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు.