న్యూఢిల్లీ: బెయిల్ ఆదేశాలపై స్టే ఇవ్వడాన్ని కోర్టులు తగ్గించుకోవాలని, ఎటువంటి కారణం లేకుండా మెకానికల్‌గా స్టే ఆదేశాలు ఉండరాదు అని సుప్రీంకోర్టు(Supreme Court) తెలిపింది. అయితే అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే బెయిల్ రిలీఫ్‌ను అడ్డుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాషిలతో కూడిన ధర్మాసనం ఓ కేసులో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చాలా క్యాజువల్‌గా బెయిల్‌పై స్టే ఇచ్చి, నిందితుడి స్వేచ్ఛను అడ్డుకోరాదు అని ధర్మాసనం తెలిపింది.
ఉగ్రవాదం లాంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని స్టేతో అడ్డుకోవచ్చు అని, కానీ ప్రతి కేసులో నిందితుడి స్వేచ్ఛను హరించలేమని, ఇది ప్రమాదకరంగా మారుతుందని, అప్పుడు ఆర్టికల్ 21 పరిస్థితి ఏంటని సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. మనీల్యాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న పర్విందర్ సింగ్ ఖురానా వేసిన పిటీషన్‌పై సుప్రీం ఈ తీర్పును ఇచ్చింది.
పర్విందర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆ నిందితుడు సుప్రీంను ఆశ్రయించారు. చాలా క్యాజువల్ పద్ధతిలో బెయిల్ ఆదేశాలపై స్టే ఇవ్వరాదు అని కోర్టులకు సుప్రీం ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై షాక్ వ్యక్తం చేసిన సుప్రీం.. ఒకవేళ ఆ వ్యక్తి ఉగ్రవాది కానప్పుడు, అతనికి స్టే విధించాల్సిన అవసరం ఏమి ఉందని జస్టిస్ ఓకా తెలిపారు.