Baba Siddique murder : బాబా సిద్ధిఖీ (Baba Siddique) హత్య తమ పార్టీకి తీరని లోటు అని ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Maharastra deputy CM) అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. హత్య వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చేందుకు మొత్తం ఐదు టీమ్‌లను ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలకు పంపించామని, రెండు మూడు రోజుల్లో కుట్రదారులు ఎవరో బయటికి వస్తుందని ఆయన అన్నారు.
గత రాత్రి హత్యకు గురైన ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముంబైలోని కూపర్ ఆస్పత్రికి తరలించారు. దాంతో ఆస్పత్రి దగ్గరకు వెళ్లిన అజిత్ పవార్.. సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధిఖీ హత్యను తాను ఇంకా నమ్మలేకపోతున్నానని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రితోపాటు తాను కూడా హత్య కేసును పర్యవేక్షిస్తున్నానని అజిత్ పవార్ చెప్పారు. సిద్ధిఖీని హత్య చేయించేందుకు ఎవరు కుట్ర చేశారో, కిరాయి హంతకులను పురమాయించింది ఎవరో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుందని అన్నారు. ముంబై లైన్స్‌లోని బాబా ఖబ్రస్థాన్‌లో ఇవాళ రాత్రి 8.30 గంటలకు బాబా సిద్ధిఖీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పూర్తిగా ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు.