Baba Siddique Murder : ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ (Baba Siddique) పై మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిగాయని, అందులో మూడు బుల్లెట్లు బాబా సిద్ధిఖీ శరీరంలోకి దూసుకెళ్లాయని ముంబై క్రైమ్ బ్రాంచ్ (Mumbai crime branch) పోలీసులు తెలిపారు. సిద్ధిఖీని హత్య చేసిన ముగ్గురిలో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నామని, మూడో నిందితుడు ఎవరో కూడా గుర్తించామని, త్వరలో అతడిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు.
ముంబైలోని క్రైమ్ బ్రాంచ్ యూనిట్-3 ఆఫీస్లో ఇద్దరు నిందితుల ఇంటరాగేషన్ జరుగుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ డీసీసీ విశాళ్ ఠాకూర్ సమక్షంలో ఇంటరాగేషన్ జరుగుతోంది. కాగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సిద్ధిఖీపై కాల్పులు జరిపి పారిపోయారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సిద్ధిఖీ కన్నుమూశారు. అయితే కాల్పులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా, సిద్దిఖీ 1999, 2004, 2009 ఎన్నికల్లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.