జైపూర్: రాజస్థాన్‌లో బీజేపీ పార్టీ హవా కొనసాగిస్తోంది. ఆధ్యాత్మిక గురువు, ఎంపీ బాబా బాలక్‌నాథ్(Baba Balaknath).. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాజస్తాన్ యోగిగా గుర్తింపు ఉన్న ఆయన.. ఆ రాష్ట్ర సీఎం పోస్టుకు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. తిజారా నియోకవర్గం నుంచి ఆయన లీడింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన భారీ మెజారిటీ సాధించారు. పార్టీ మీటింగ్‌లో సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని బాబా బాలక్‌నాథ్ వెల్లడించారు.
రాజస్తాన్‌లో కాంగ్రెస్ తరపున అశోక్ గెహ్లాట్ సీఎం అభ్యర్థిగా పోటీ కొనసాగించారు. కానీ బీజేపీ మాత్రం సీఎం అభ్యర్థి ఎవరన్న విషయాన్ని చెప్పకుండానే ఎన్నికల్లో పోటీ చేసింది. మాజీ సీఎం వసుంధరా రాజేతో పాటు మరో మహిళ దియా కుమారి కూడా ఆ రేసులో ఉన్నారు. ఆ ఇద్దరికి తోడు ఇప్పుడు యోగి బాబా బాలక్‌నాథ్ కూడా సీఎం పదవి కోసం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ సీఎంగా బాలక్‌నాథ్ ఎన్నికైతే, అప్పుడు యోగి ఆదిత్యనాథ్ తర్వాత సీఎం స్థానాన్ని చేజిక్కించుకున్న యోగిగా బాలక్‌నాథ్ రికార్డు క్రియేట్ చేయనున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాలక్‌నాథ్ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేశారు.