హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లను ఆగస్టు 14లోపు ముగించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో అడ్మిషన్లు కల్పించే ల్యాటరల్ ఎంట్రీ అడ్మిషన్లను సైతం ఆగస్టు 14లోపే పూర్తిచేయాలని గడువు విధించింది. ఇంజినీరింగ్ ఫస్టియర్ క్లాసులను ఆగస్టు 14 నుంచే ప్రారంభించాలని ఇటీవల ఏఐసీటీఈ అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. నిరుడు అక్టోబర్ 23 లోపు పూర్తిచేయాలని ఆదేశించగా, ఈ సారి ఆగస్టులోపే పూర్తిచేయాలని ఏఐసీటీఈ ఆదేశాలిచ్చింది. అంటే విద్యాసంవత్సరం దాదాపు రెండు నెలలు ముందుకు జరగనున్నది. ఈనెల 30లోపు తాము ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులిస్తామని, జూలై 31లోపు యూనివర్సిటీలు, బోర్డులు అనుమతులిచ్చుకోవచ్చని తెలిపింది. పీజీడీఎం, పీజీసీఎం కోర్సుల్లో అడ్మిషన్లకు జూలై 31 గడువుగా విధించింది. ఆగస్టు 1 నుంచి క్లాసులు నిర్వహించాలన్నది. దేశంలోని సాంకేతిక విద్యాసంస్థలకు ఏఐసీటీఈ ఏటా అనుమతులిస్తున్నది.
అన్నింటికి అనుమతులొచ్చేనా.. ?
తెలంగాణలో 175 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఏఐసీటీఈ ఇచ్చిన మొత్తం సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదు. 2024-25 విద్యాసంవత్సరంలో ఏఐసీటీఈ 1,29,367 ఇంజినీరింగ్ ఫస్టియర్ సీట్లకు అనుమతి ఇచ్చింది. అయితే జేఎన్టీయూ, సాంకేతిక విద్యాశాఖలు 1,18,778 సీట్లకు మాత్రమే అనుమతులు ఇచ్చాయి. వీటిలో కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా సీట్లున్నాయి. అంటే ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన వాటిలో 10,589 సీట్లకు రాష్ట్రం కోతపెట్టింది. మరో 14 కాలేజీల్లో కోర్సుల కన్వర్షన్కు అనుమతి ఇవ్వకపోవడంతో మరో 7వేల సీట్లకు కోతపడనున్నది. ఈ సారి ఏఐసీటీఈ ఇచ్చిన మొత్తం సీట్లకు రాష్ట్రప్రభుత్వం అనుమతినిస్తుందా..? అన్న అనుమానాలొస్తున్నాయి.