ప్రయాగ్రాజ్: శంకరాచార్య అవిముక్తేశ్వరానంద(Avimukteshwaranand)కు ప్రయాగ్రాజ్లో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. నిజమైన శంకరాచార్యా అవునా కాదా అని 24 గంటల్లోగా నిరూపించుకోవాలని ఆయనకు మాఘమేళ అధికారులు నోటీసులు జారీ చేశారు. మౌని అమావాస్య రోజున తన రథాన్ని అధికారులు అడ్డుకోవడంతో ఆయన ఆందోళనకు దిగారు. దీంతో మేళా అధికారులు రంగంలోకి దిగి.. 24 గంటల్లోగా నిజమైన శంకరాచార్య అని నిరూపించుకోవాలని ఆదేశించారు.
మాఘ మేళ వద్ద అవిముక్తేశ్వరానంద క్యాంపును ఏర్పాటు చేశారు. అక్కడకు వెళ్లిన అధికారి అనిల్ కుమార్ నోటీసులు జారీ చేశారు. జ్యోషి మఠంకు చెందిన శంకరాచార్య పోస్టుపై చాన్నాళ్లుగా వివాదం చెలరేగుతున్నది. ఆ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. తుది తీర్పు వెల్లడించే వరకు ఎవర్నీ శంకరాచార్యగా ప్రకటించరాదు అని, పట్టాభిషేకం కూడా నిర్వహించరాదు అని 2022 అక్టోబర్ 14వ తేదీన సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఆ పోస్టును ఎవరూ ఆక్రమించరాదు అని కోర్టు చెప్పింది.
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మాఘమేళ క్యాంపు వద్ద జ్యోతిపీఠం శంకరాచార్య అంటూ అవిముక్తేశ్వరానంద బోర్డు పెట్టుకున్నారు. దీన్ని మాఘమేళ అధికారులు వ్యతిరేకించారు. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. మౌని అమావాస్య రోజున రథాన్ని వదిలి పాదాలపై నడుచుకుంటూ వెళ్లాలని ఆదేశాలు ఇవ్వడంతో అవిముక్తేశ్వరానంద ఆందోళనకు దిగారు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో అనేక మంది సాధువులు గాయపడ్డారు. ఆ గొడవలో రథాన్ని నదీ సంగమానికి దూరంగా తీసుకెళ్లారు. అవిముక్తేశ్వరానంద పవిత్ర స్నానం చేయలేకపోయారు.
జ్యోతిర్మఠ పీఠాధిపతి అంశంలో 1989 ఏప్రిల్ 8వ తేదీ నుంచి వివాదం చెలరేగుతున్నది. స్వరూపానంద సరస్వతి ఆ రోజు నుంచి తనకు తాను శంకరాచార్య అని ప్రకటించుకున్నారు. అయితే 1989 ఏప్రిల్ 15వ తేదీన ఆ పీఠానికి చెందిన వసుదేవానంద సరస్వతిని వారసుడిగా శతానంద ప్రకటించారు. దీంతో ఆ పీఠానికి ఇద్దరు పీఠాధిపతులు ఉన్నట్లు అయ్యింది. అప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉన్నది. 2022 సెప్టెంబర్లో స్వరూపానంద సరస్వతి పరమపదించారు. ఆ మరుసటి రోజే తానే శంకరాచార్య అంటూ అవిముక్తేశ్వరానంద ప్రకటించుకున్నారు. కానీ అక్టోబర్లో ఆయనపై సుప్రీంకోర్టు బ్యాన్ విధించింది.