న్యూఢిల్లీ: ఆస్ట్రియాకు చెందిన బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్(Influencer Killed) స్టిఫానీ పైపర్ దారుణమైన హత్యకు గురైంది. ఆమె మాజీ ప్రియుడే ఆమెను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ఓ సూట్‌కేసులో పెట్టి.. దాన్ని ఓ అడవిలో వదిలేశాడు. ఈ మర్డర్ ఘటన ఆస్ట్రియాలో తీవ్ర సంచలనం క్రియేట్ చేసింది. మేకప్, ఫ్యాషన్, సింగింగ్ కాంటెంట్‌కు పేరుగాంచిన బాధితురాలు స్టిఫానీ వయసు 31 ఏళ్లు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం నవంబర్ 23వ తేదీన ఓ పార్టీకి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత స్టిఫానీ అదృశ్యమైంది. ఇంటికి సురక్షితంగా చేరుకున్నట్లు మెసేజ్ చేసిన ఆమె ఆ తర్వాత మరో మెసేజ్ చేసింది. తన ఇంట్లో ఎవరో ఉన్నట్లు ఆ ఫ్రెండ్‌కు మెసేజ్ పంపింది.
బాధితురాలి ఇంటి నుంచి గట్టిగా అరుపులు వినిపించాయని, ఆ బిల్డింగ్‌లో ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్లు స్థానినికులు అనుమానించారు. స్టిఫానీ పైపర్ బంధువులు, తోటి ఉద్యోగులు ఆమెను చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ పైపర్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. అయితే పైపర్ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను స్లోవేనియాలో అరెస్టు చేశారు.
నిందితుడు పలుమార్లు స్లోవేనియాకు తన కారులో వెళ్లినట్లు గుర్తించారు. నవంబర్ 24వ తేదీన నిందితుడి కారు ఓ పార్కింగ్ ఏరియాలో అగ్నిప్రమాదానికి గురైంది. అయితే నిందితుడిని ఆస్ట్రియాకు అప్పగించారు. విచారణ సమయంలో బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ సహకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పైపర్‌ను గొంతు నులిమి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని సూట్‌కేసులో పెట్టి, స్లోవేనియా అడవిలో పాతిపెట్టాడు. నిందితుడే ఆ తర్వాత ఆమెను బొందపెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. నిందిత వ్యక్తికి చెందిన మరో ఇద్దరు బంధువుల్ని కూడా ఆ హత్య కేసులో అదుపులోకి తీసుకున్నారు.