ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మరణంపై ఆమె తండ్రి సతీష్ సాలియన్ చేసిన ఆరోపణలపై శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) స్పందించారు. తన ప్రతిష్టను కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు గత ఐదేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా వాదనలు కోర్టులో వినిపిస్తాం. ఈ ఆరోపణలకు సమాధానాలు కోర్టుకు చెబుతాం’ అని అన్నారు. తన పరువు తీసేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆయన ఆరోపించారు. గత ఐదేళ్లుగా ఈ ఆరోపణలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై కోర్టులో స్పందిస్తానని చెప్పారు.
మరోవైపు ఆదిత్య ఠాక్రేపై కేసు నమోదు చేయాలంటూ దిశా సాలియన్ తండ్రి తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించడంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఐదేళ్ల తర్వాత పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు. ‘పోలీసుల దర్యాప్తును నేను చూశా. ఇది ప్రమాదం, హత్య కాదు. సంఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత ఆమె తండ్రి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వెనుక ఉన్న రాజకీయం రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఔరంగజేబ్ సమస్య నుంచి చేతులు కడుక్కోవడానికి దిశా కేసును తెరపైకి తెస్తున్నారు’ అని అన్నారు. ఠాక్రే కుటుంబం పరువు తీసేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని సంజయ్ రౌత్ ఆరోపించారు.