కోల్కతా: మైనర్ బాధితురాలి వక్షోజాలను పట్టుకోవడానికి ప్రయత్నించడం ‘తీవ్రస్థాయి లైంగిక దాడి’ అవుతుందే తప్ప అది అత్యాచార యత్నం కిందకు రాదని కలకత్తా హైకోర్టు శుక్రవారం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓ పోక్సో కేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేసింది. అయితే కింది కోర్టు మాత్రం నిందితుడు తీవ్రస్థాయి లైంగిక దాడితోపాటు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు నిర్ధారించి 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
నిందితుడు దాఖలు చేసిన అప్పీలుపై విచారణ జరిపిన జస్టిస్ అరిజిత్ బెనర్జీ, జస్టిస్ బిస్వరూప్ చౌదరితో కూడిన హైకోర్టు ధర్మాసనం శిక్షను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. బాధితురాలికి నిర్వహించిన వైద్య పరీక్షలలో ఆమెపై రేప్ జరిగినట్లు కాని అత్యాచార యత్నం జరిగినట్లు కాని నిర్ధారణ కాలేదని ధర్మాసనం పేర్కొంది.