పాట్నా: జనతా దళ్ యునైటెడ్ పార్టీ చీఫ్‌గా మళ్లీ బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జేడీయూ చీఫ్‌గా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఉన్నారు. అయితే ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించేందుకు నితీశ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 29వ తేదీన జరగనున్న పార్టీ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పార్టీ చీఫ్‌గా మళ్లీ నితీశ్ కుమారే బాధ్యతలు స్వీకరించనున్నట్లు కొన్ని వర్గాలు ద్వారా తెలుస్తోంది.
పార్టీలో అంతర్గత విభేదాలకు బ్రేక్ ఇవ్వాలంటే మళ్లీ తానే ప్రెసిడెంట్ పోస్టును స్వీకరించాల్సి ఉంటుందని నితీశ్ కుమార్ పార్టీలోని తన సన్నిహితులతో చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లలన్ సింగ్ పార్టీని నడుపుతున్న తీరు పట్ల నితీశ్ అసంతృప్తితో ఉన్నారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో అతను సన్నిహితంగా మూవ్ అవుతున్నట్లు నితీశ్ అనుమానాలు వ్యక్తం చేశారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ముంజెర్ స్థానం నుంచే పోటీ చేసేందుకు లలన్ సింగ్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఈసారి ఆయన ఆర్జేడీ టికెట్‌పై పోటీ పడుతారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియా కూటమి నేతలతోనూ జేడీయూ విధానాలను చర్చించడంలో లలన్ సింగ్ విఫలమైనట్లు నితీశ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.