న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నది. దీంతో రోజు రోజుకు గాలి నాణ్యత క్షీణిస్తున్నది. అయితే దీనికి ఉత్తర ప్రదేశ్ ఆర్టీసీ బస్సులే కారణమని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. యూపీ ప్రభుత్వ బస్సుల నుంచి విడుదలయ్యే ఉద్గారాల కారణంగా ఢిల్లీలోని ఆనంద్ విహార్, వివేక్ విహార్ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) క్షీణించిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తిరిగే యూపీ బస్సులు కాలుష్యం వెదజల్లకుండా ఉండేలా తనిఖీ చేయాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను ఆయన కోరారు.
కాగా, ఢిల్లీలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ వెలిగితే, వాహనాల ఇంజిన్ ఆఫ్ చేయాలన్న తమ ప్రభుత్వ ప్రచారాన్ని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా నిలిపివేయడంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మండిపడ్డారు. ‘రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్’ ప్రచారాన్ని అమలు చేస్తే, వాహన ఉద్గారాలు 15 నుంచి 20 శాతం తగ్గుతాయని అన్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఆపేశారని ఆయన విమర్శించారు.
Hon’ble Environment Minister Sh. @AapKaGopalRai Addressing an Important Press Conference | LIVE https://t.co/oN3gH91u6v
— AAP (@AamAadmiParty) October 30, 2022