చండీఘడ్: అర్జున్ అవార్డు గ్రహీత, పంజాబ్ పోలీసు శాఖలో డీఎస్పీగా చేసిన జగదీశ్ బోలా(Jagdish Bhola) .. 12 ఏళ్ల తర్వాత ఇవాళ పంజాబ్‌లోని భటిండా సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మే 21వ తేదీన పంజాబ్, హర్యానా హైకోర్టు అతనికి బెయిల్ మంజూరీ చేసింది. సుమారు 700 కోట్ల విలువైన సింథటిక్ నార్కోటిక్స్ డ్రగ్ రాకెట్లో జగదీశ్ నిందితుడిగా ఉన్నాడు. బోలా రిలీజైన విషయాన్ని భటిండా సెంట్రల్ జైలు సూపరిటెండెంట్ మంజిత్ సింగ్ సిద్దూ కన్పర్మ్ చేశాడు.
కఠినమైన షరతులపై హైకోర్టు బెయిల్ ఆదేశాలు జారీ చేసింది. 5 లక్షల పూచీకత్తుపై అతనికి బెయిల్ మంజూరీ చేశారు. పాస్‌పోర్టును అతను సరెండర్ చేశారు. కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టులో పాల్గోవాలని ఆదేశించారు. జైలు నుంచి రిలీజైన 15 రోజుల్లోనే అతన 100 మొక్కలను నాటాల్సి ఉంటుంది.
2013 నవంబర్‌లో జగదీశ్ బోలాను అరెస్టు చేశారు. అంతర్ రాష్ట్ర డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో అతన్ని ప్రధాన వ్యక్తిగా గుర్తించారు. పంజాబ్ పోలీసు శాఖ, కేంద్ర ఏజెన్సీలు అతన్ని పట్టుకున్నాయి. సుమారు 700 కోట్ల ఖరీదైన సూడోఫిడ్రైన్ లాంటి సింథటిక్ డ్రగ్స్‌ను ఆ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నారు. 2019లో సీబీఐ కోర్టు అనికి 24 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. మనీల్యాండరింగ్ కేసులో అతనికి 2024లో మరో పదేళ్ల శిక్ష పడింది.
ఒకప్పుడు భారతీయ రెజ్లింగ్‌లో బోలాను కింగ్ కాంగ్‌గా పిలిచేవారు. 1991 ఏషియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు.