Dwarka | ద్వారక, ఫిబ్రవరి 20: శ్రీకృష్ణుడి కర్మభూమిని అన్వేషించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. సముద్రగర్భంలోని సుందర ద్వారకపై ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) మరోసారి అధ్యయనం చేస్తున్నది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఏఎస్ఐ అనుబంధ విభాగమైన అండర్వాటర్ ఆర్కియాలజీ వింగ్(యూఏడబ్ల్యూ) అరేబియా సముద్రంలో శోధనలు ప్రారంభించింది. కృష్ణుడు నడయాడిన నేలకు సంబంధించిన మరిన్ని విశేషాలను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు ప్రయత్నిస్తున్నది.
ఇందుకోసం అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఆర్కియాలజీ) ప్రొఫెసరల్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల పురావస్తు శాస్త్రవేత్తల బృందం పని చేస్తున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఈ ఐదుగురి బృందంలో ముగ్గురు మహిళా ఆర్కియాలజిస్టులు అపరాజిత శర్మ, పూనమ్ వింద్, రాజ్కుమారి బర్బినా కూడా ఉన్నారు.
హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో ద్వారక నగరానికి విశేష ప్రాధాన్యం ఉంది. కృష్ణుడి కర్మభూమిగా భావించే ఈ నగరం హిందువుల ఏడు మోక్షనగరాల్లో ఒకటి. జరాసంధుడి దాడుల నుంచి తన ప్రజలను రక్షించుకునేందుకు కృష్ణుడు మధురను వీడి, గోమతీ నదీ – అరేబియా సముద్ర సంగమ ప్రాంతానికి వెళ్తాడు. దేవశిల్పి విశ్వకర్మ సాయంతో అక్కడ సుందర ద్వారక నగరాన్ని నిర్మించాడని విశ్వాసం. దీనినే బేట్ ద్వారక అంటున్నారు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందని భావిస్తారు.
ద్వారక నగరాన్వేషణ పురావస్తు శాస్త్రవేత్తలకు నిత్యం ఒక కుతూహలాన్ని కలిగిస్తుంది. 1930లలో మొదటిసారిగా హిరానంద్ శాస్త్రి ద్వారక రహస్యాలను తెలుసుకునేందుకు అన్వేషించారు. 1963లో జేఎం నానావతి, హెచ్డీ సంకాలియా ఆధ్వర్యంలో మొదటిసారిగా ద్వారకలో తవ్వకాలు జరిగాయి. 1969-70, 1983-1990 మధ్య సముద్రగర్భంలో ద్వారక అవశేషాలను, అప్పుడు వినియోగించిన కొన్ని వస్తువులను సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చివరగా 2005-07లోనూ యూఏడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్వేషణ జరిగింది. వీరంతా సముద్రగర్భంలో ప్రణాళికబద్ధంగా నిర్మించిన ఒక నగర అవశేషాలు, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు.
శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెప్తున్నాయి. సముద్రగర్భంలో నిజంగానే ఒక నగర అవశేషాలు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయనాలు తేల్చాయి. అయితే, శ్రీకృష్ణుడి ద్వారక నగరం ఇదేనా? సముద్రగర్భంలోని నిర్మాణాలు ఏ కాలం నాటివి? ఈ నిర్మాణాల విశేషాలు ఏంటి? అనేది తేలాల్సి ఉంది. పురాణాలకు, చరిత్రకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చడమే ఇప్పుడు అండర్వాటర్ ఆర్కియాలజీ వింగ్ చేస్తున్న అన్వేషణ లక్ష్యం. దశలవారీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు, ఇప్పుడు ప్రాథమిక అధ్యయనం కోసం గోమతి నదీ సమీప ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు అధికారులు తెలిపారు.