న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఏడాది పాటు ఉచితంగా రేషన్ అందిస్తామని ప్రకటించింది. ఇందుకు ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు రూ.2 లక్షల కోట్ల భారం పడుతుందని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆహార భద్రతా చట్టం కింద ప్రభుత్వం ప్రస్తుతం రాయితీపై ఆహార ధాన్యాలు అందిస్తున్నది. కాగా, డిసెంబర్ 31తో ముగియనున్న ఉచిత రేషన్ స్కీమ్ ‘పీఎంజీకేఏవై’ను పొడిగించకూడదని క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నది.
‘వన్ర్యాంక్ వన్ పెన్షన్’ స్కీమ్ సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 2019, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ సవరణ ద్వారా దాదాపు 25 లక్షల మంది సాయుధ దళాల సిబ్బంది, సంబంధిత కుటుంబ పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఏడాదికి రూ.8,450 కోట్ల అదనపు వ్యయం అవుతుందని రక్షణ శాఖ వెల్లడించింది. జూలై 2019 నుంచి జూన్ 2022 వరకు పెన్షనర్లకు రూ.23,638 కోట్ల అరియర్స్ రూపంలో చెల్లింపు ఉంటుందని పేర్కొన్నది. 2019, జూన్ 30 కంటే ముందు వరకు రిటైర్ అయిన సాయుధ దళాల సిబ్బంది ఈ సవరణ స్కీమ్ కిందకు వస్తారని తెలిపింది.