
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో కోటా ఇవ్వాలన్న నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ఎలాంటి కసరత్తు చేపట్టారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక క్యాడర్ ఉద్యోగంలో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో కోటాను న్యాయపరంగా సవాల్ చేస్తే ఏం సమాధానం చెబుతారని అడిగింది. ఆ క్యాడర్లో ఎస్సీ, ఎస్టీలకు తక్కువ ప్రాతినిధ్యం ఉందని, కోటా వల్ల పరిపాలనాపరమైన సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం పడదన్న అంశాల ప్రాతిపదికన కేంద్రం ఎలా సమర్థించుకుంటుందని నిలదీసింది. ‘సూత్రాల గురించి వాదించవద్దు. డాటాను చూపించండ’ని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్ కోరింది.
కారుణ్య నియామకం హక్కు కాదు: సుప్రీంకోర్టు
ప్రభుత్వ ఉద్యోగాల్లో కారుణ్య నియామకం ప్రత్యేక సదుపాయమే తప్ప హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కారుణ్య నియామకంలో అభ్యర్థులందరికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 కింద సమాన అవకాశం కల్పించాలని పేర్కొంది. అలాగే చనిపోయిన ఉద్యోగి కంటే ఉన్నత పోస్టు ఇవ్వాలని కారుణ్య నియామకం కింద సదరు అభ్యర్థి (డిపెండెంట్) కోరడానికి వీల్లేదని స్పష్టంచేసింది.