అమరావతి : వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పేర్ని నానిని ఒక బఫూన్‌గా అభివర్ణించారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్‌తోపాటు పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
బందరులో ఒక బఫూన్ ఉన్నాడని, షాడోలను అడ్డుపెట్టుకుని అక్రమంగా చెరువులు తవ్వించాడని, మడ అడవులను సైతం ఆక్రమించి చెరువులుగా మార్చాడని పేర్ని నానిని ఉద్దేశించి మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేసి భూములు దోచుకోవడానికి నాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలకు తావులేదని అన్నారు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.