భువనేశ్వర్, ఆగస్టు 7: బాలాసోర్ కాలేజీ విద్యార్థిని ఆత్మాహుతి ఘటన మరువకముందే.. బీజేపీ పాలిత ఒడిశాలో మరో ఘటన చోటుచేసుకుంది. కేంద్రపారా జిల్లాలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న 20 ఏండ్ల యువతి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని నెలలుగా మాజీ బాయ్‌ఫ్రెండ్ నుంచి తన కూతురు వేధింపులు ఎదుర్కొంటున్నదని, ఈ వేధింపులను తట్టుకోలేకే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని బాధితురాలి తండ్రి ఆరోపించారు. తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటపెడతానని అతడు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడని, పెట్రోల్ పోసి చంపుతానని బెదిరింపులకు దిగాడని ఆయన ఆరోపించాడు. దీనిపై 6 నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. .
బీజీపీ పాలిత ఒడిశాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళపై అటవీ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఆదివారం సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. అంగుల్ జిల్లాకు చెందిన ఒక గిరిజన మహిళ తన మేనల్లుడితో కలిసి చెండిపాడ ప్రాంతంలోని దవాఖనకు వెళ్లి మధ్యాహ్నం బైక్‌పై తిరిగి వస్తున్నది. దారిలో అటవీ ప్రాంతంలో లఘుశంక కోసం ఆగగా, ట్రాక్టర్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకుపోయి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు.