Haryana Assembly Polls : సీనియర్ బీజేపీ నేత, మాజీ మంత్రి అనిల్ విజ్ హరియాణ సీఎం పీఠంపై కన్నేశారు. తాను పార్టీలో సీనియర్‌నని, రానున్న హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే తాను సీఎం రేసులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. హరియాణ ప్రస్తుత సీఎం నయబ్ సింగ్ సైనీ పార్టీ సీఎం అభ్యర్ధిగా బీజేపీ ఇప్పటికే ప్రకటించిన క్రమంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్ విజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అనిల్ విజ్ ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తానిప్పటి వరకూ పార్టీ నుంచి ఏమీ కోరలేదని, కానీ ఇప్పుడు తన సీనియరిటీ ప్రకారం సీఎం పదవిని తాను కోరుతున్నానని చెప్పారు. హరియాణ ప్రజలు తనను కలిసేందుకు వస్తున్నారని, తన నియోజకవర్గమైన అంబాలా ప్రజలు సైతం సీనియర్ నేత అయిన మీరు అత్యున్నత పదవి చేపట్టాలని కోరుతున్నారని తెలిపారు. ప్రజల కోరిక మేరకు, తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని సీఎం పదవికి తనను పరిశీలించాలని ఈసారి తాను కోరతానని చెప్పారు.
పార్టీ నాయకత్వం తనకు హరియాణ సీఎం పదవి అప్పగిస్తే హరియాణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తానని తెలిపారు. కాగా మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా అనంతరం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వం ఇటీవల కొలువుతీరిన క్రమంలో అనిల్ విజ్‌కు సైనీ క్యాబినెట్లో స్ధానం దక్కని సంగతి తెలిసిందే. ఇక అనిల్ విజ్‌ను అంబాలా కంటోన్మెంట్ నుంచి బీజేపీ బరిలో దింపగా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఈనెల 11న ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
Read More :