న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ (49) గుండెపోటుతో అమెరికాలో మరణించారు. అనిల్ మాట్లాడుతూ, ఇది తన జీవితంలో అత్యంత చీకటి రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు మెటల్స్ బిజినెస్‌లో ఉత్తమ కంపెనీల్లో ఒకటైన ఫ్యుజీరా గోల్డ్‌ను స్థాపించి, విజయవంతంగా నిర్వహించారు. హిందుస్థాన్ జింక్ చైర్మన్‌గా కూడా పని చేశారు. తన కుమారుడు ఎన్ని విజయాలు సాధించినప్పటికీ నిరాడంబరంగా, ఆత్మీయంగా, మంచి మనిషిగా వ్యవహరించారని అనిల్ తెలిపారు.
ఈ విషాదం తన దాతృత్వ స్వప్నాన్ని మరింత పటిష్టపరిచిందన్నారు. తాను తన కుమారుడితో పంచుకున్న దాతృత్వ స్వప్నం మరింత బలోపేతమైందని చెప్పారు. ఆకలితో నిద్రపోయే చిన్నారి ఒకరు కూడా ఉండకూడదని, విద్యకు దూరమయ్యే బాలబాలికలు ఉండకూడదని, ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడగలగాలని, ప్రతి యువ భారతీయునికి అర్థవంతమైన పని దొరకాలని తాము కలలుగన్నామని వివరించారు. మేం సంపాదించిన దానిలో 75 శాతానికిపైగా సమాజానికి తిరిగి ఇస్తానని తాను తన కుమారునికి మాట ఇచ్చానని తెలిపారు. “నేడు నేను ఆ మాటను పునరుద్ధరిస్తున్నాను, మరింత నిరాడంబర జీవితాన్ని గడపాలని దృఢంగా సంకల్పించుకున్నాను” అని చెప్పారు.