హూస్టన్ : తెలుగమ్మాయి, కమర్షియల్ ఆస్ట్రోనాట్ శిరీష బండ్ల .. వర్జిన్ గెలాక్టిక్ కంపెనీకి చెందిన యూనిటీ22 రాకెట్ ద్వారా గగనవీధిలో విహరించిన విషయం తెలిసిందే. ఆ అనుభవాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు. ఆకాశం అంచుల్లోకి వెళ్లిన తీరు అద్భుతమని ఆమె అన్నారు. గగనవీధి నుంచి భూమిని చూడడం జీవితకాల అనుభవంగా ఆమె పేర్కొన్నది. భూమి నుంచి 85 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన శిరీషతో పాటు వర్జిన్ గెలాక్టిక్ బృందానికి కమర్షియల్ ఆస్ట్రోనాట్స్ అవార్డులను అందజేశారు. 34 ఏళ్ల ఏరోనాటికల్ ఇంజినీర్ శిరీష్ మాట్లాడుతూ.. ఇంకా తాను ఆకాశంలో ఉన్నట్లుగా ఫీలవుతున్నట్లు చెప్పింది. తన ప్రయాణం ఓ అద్భుతమని, అంతకన్నా మరో మాట రావడం లేదన్నారు. అంతరిక్షంలోకి వెళ్లి.. తిరిగి భూమ్మీదకు రావడం అమోఘంగా ఉందని ఆమె అన్నారు. టీనేజీ నుంచే స్పేస్‌లోకి వెళ్లాలనుకున్నానని, కానీ ఇప్పుడు ఆ కల నిజమైందన్నారు.
"To all you kids down there…" – @RichardBranson's message from zero gravity. #Unity22
— Virgin Galactic (@virgingalactic) July 11, 2021
Watch the livestream: https://t.co/5UalYT7Hjb pic.twitter.com/lYXHNsDQcU
తనకు ఆస్ట్రోనాట్ కావాలని ఉందని, కానీ నాసాకు ఆస్ట్రోనాట్ కాలేకపోయానని, కానీ మరో విభిన్న రీతిలో అంతరిక్షంలో విహరించినట్లు శిరీష తెలిపారు. ఇలాంటి అనుభూతిని భవిష్యత్తులో అనేక మంది పొందుతారని ఆమె అన్నారు. శిరీషకు కంటిచూపు సమస్య ఉన్నందున ఆమె నాసాకు ఆస్ట్రోనాట్‌గా ఎంపిక కాలేకపోయారు. కేవలం సంపన్నులే అంతరిక్ష చేయాలా అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. వర్జిన్ గెలాక్టిక్ కొత్త తరహా యూనిటీ రాకెట్లను తయారు చేస్తోందని, భవిష్యత్తులో రోదసీ ప్రయాణం ఖర్చు తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. అంతరిక్ష అనుభూతి పరిశోధకురాలి పాత్రలో ఆమె యూనిటీ22లో ప్రయాణించారు. వర్జిన్ బృందంలో మరో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బందితో పాటు ఓనర్ బ్రాన్సన్ ఉన్న విషయం తెలిసిందే.