Tarun Rayan | సోషల్ మీడియా.. ఎప్పుడు ఎవర్ని స్టార్‌ను చేస్తుందో ఊహించలేం! అప్పుడెప్పుడో ‘కచ్చా బాదాం!’ అంటూ పాడిన భుబన్ బద్యాకర్, ఒక్కరోజులోనే బాలీవుడ్ సింగర్‌గా మారిన రానూ మండల్.. ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయినవారే! ఇప్పుడు తరుణ్ రాయన్ వంతు. ‘నా గురించి తెలుసుకోవాలంటే.. నా పేరును గూగుల్‌లో వెతకండి!’ అంటున్న ఈ తోపుడుబండి కుర్రాడు.. సోషల్‌మీడియాలో తాజా సెన్సేషన్! చెన్నైకి చెందిన రాయన్.. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో పీహెచ్డీ చేస్తున్నాడు.
కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు తోపుడు బండిపై చవులూరించే పాకాలు చేసి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన వ్లాగర్ క్రిస్టఫర్ లూయిస్.. తన వీడియోల్లో తమిళనాడును ఎక్స్ప్లోర్ చేస్తూ.. తరుణ్ రాయన్ బండి దగ్గరికి వచ్చాడు. చికెన్ 65 ఆర్డర్ ఇచ్చి.. ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్న రాయన్‌ను పలకరించాడు. తన గురించి చెప్పమంటూ అడిగాడు. అప్పుడు రాయన్ చెప్పిన సమాధానం విని.. క్రిస్టఫర్ మాత్రమే కాదు సోషల్ మీడియానే నోరెళ్లబెట్టింది.
‘నా పేరును గూగుల్‌లో వెతకండి. నా పీహెచ్డీ పరిశోధనా వ్యాసాలు మీకు కనిస్తాయి!’ అని చెబుతున్న రాయన్ వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇప్పటికే లక్షకుపైగా వ్యూస్‌ను సాధించింది. ఈ వీడియోలో రాయన్‌ను చూసినవారంతా.. అతణ్ని తెగ పొగిడేస్తున్నారు. ఓవైపు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూనే.. కుటుంబం కోసం వీధి వ్యాపారిగా రాణిస్తున్నాడనీ, అతని కష్టపడేతత్వానికి ముగ్ధులవుతున్నారు.