న్యూఢిల్లీ: దక్షిణ అమెరికాలోని 8 దేశాల్లో విస్తరించిన అమెజాన్ అడవులు అంతరించిపోతున్నాయి! విస్తీర్ణంలో భారత్ కంటే దాదాపు రెట్టింపుగల ఈ అడవులు 2050 నాటికి సుమారు 47 శాతం తగ్గిపోబోతున్నాయని బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ శాంటా కాటరినా విడుదల చేసిన నివేదిక తెలిపింది.
దీనికి కారణం వాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, కార్చిచ్చులు, అడవుల నరికివేత, ఆక్రమణలు అని వివరించింది. ప్రపంచ పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు కీలకంగా ఉపయోగపడుతున్న అమెజాన్ అడవుల్లో ఇప్పటికే 15 శాతం నాశనమైనట్లు తెలిపింది. ఈ పరిస్థితి మరింత తీవ్రమైతే, ఈ అటవీ ప్రాంతం ఉష్ణమండల పచ్చిక బయలుగా మారిపోవచ్చునని అంచనా వేసింది.