RB Uday Kumar : తమిళనాడు (Tamil Nadu) లో రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) కి అన్నాడీఎంకే (AIADMK) సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ (RB Uday Kumar) కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన రాజకీయ పొరపాటును పునరావృతం చేయవద్దని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరహాలో సరైన సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.
అన్నా డీఎంకే కూటమిలో చేరకపోతే విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాజకీయంగా కనుమరుగవడం ఖాయమని ఉదయ్‌కుమార్ హెచ్చరించారు. మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉదయకుమార్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.
తమ కూటమిలో చేరేందుకు మరిన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, ఇదే సమయంలో విజయ్ కూడా తమతో కలవాలని ఆహ్వానించారు. అన్నాడీఎంకే మెగా కూటమిలో టీవీకే చేరడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. ఈ అవకాశాన్ని విజయ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ కూటమిలో చేరకపోతే ఎన్నికల తర్వాత డీఎంకే ఆ పార్టీని నాశనం చేస్తుందని జోష్యం చెప్పారు.
ఒంటరిగా బరిలో దిగితే టీవీకే అడ్రస్ లేకుండా పోతుందని ఉదయకుమార్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పొత్తులపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయారని, కానీ పవన్ కల్యాణ్ సరైన సమయంలో సరైన పొత్తు నిర్ణయంతో పార్టీని నిలబెట్టుకోవడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.
తన మాటను విజయ్ గుర్తుపెట్టుకోవాలని, డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే విజయ్ను దేవుడు కూడా కాపాడలేడని ఉదయ్‌కుమార్ వ్యాఖ్యానించారు.