Air Travel | న్యూఢిల్లీ, ఆగస్టు 19: విమాన ప్రయాణం చేస్తున్నారా? ఫ్లైట్‌లో మీరు కూర్చొంటున్న సీటు, సీట్ బెల్ట్, ఆహార పదార్థాలు పెట్టుకొనే ట్రే టేబుల్ వంటిని శుభ్రంగా ఉన్నాయా? లేవా? అని చూసుకొంటున్నారా?. అవి శుభ్రంగా లేకుంటే విమాన ప్రయాణం తర్వాత డయేరియా, తలనొప్పి, కడుపులో నొప్పి వంటి అనారోగ్య సమస్యలకు గురవుతారని జైపూర్‌కు చెందిన సుదీప్తో అనే డాక్టర్ హెచ్చరిస్తున్నారు.
విమాన ప్రయాణం పలు అనారోగ్య సమస్యలకు ఎలా దారితీస్తుందో ఆయన తన ఎక్స్ ఖాతాలో వివరించారు. చాలా మంది ఇలాంటి అనారోగ్య సమస్యలతో తన వద్దకు వచ్చారని తెలిపారు. విమానంలో సీట్లు, ట్రే టేబుళ్లు, సీట్ బెల్ట్‌లు, ఆర్మ్ రెస్టులు వంటివి ప్రయాణాల్లో అందరూ సాధారణంగా టచ్ చేసేవి ఉంటాయని, వాటిపై ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర వ్యాధికారకాలు అనారోగ్యం కలిగిస్తాయనే విషయాన్ని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయని పేర్కొన్నారు.
వెంటనే తిరుగు ప్రయాణం చేయాల్సి రావడం వలన విమానంలో పూర్తిగా శుభ్రం చేసేందుకు అవకాశం ఉండదని, సీట్ల వరకు ఏదో కొంత మేర క్లీనింగ్ చేస్తారని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఫ్యాబ్రిక్ సీట్లు తేమను పీల్చుకొని ఎక్కువ సేపు ఉంచుతాయని, దీని వలన బ్యాక్టీరియా, వైరస్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు.
ముఖ్యంగా వేడి వాతావరణంలో ప్రయాణాలు చేసే సమయంలో వ్యక్తి చెమట హెడ్ రెస్టులకు అంటుకుంటుందని చెప్పారు. అదేవిధంగా ప్రయాణికులు దగ్గరదగ్గరగా కూర్చోవడం వలన సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి సులభంగా ట్రాన్స్ఫర్ అవుతాయని పేర్కొన్నారు. సాధారణ పరిశుభ్రతను పాటించకపోతే ఏ ప్రజా రవాణాలోనైనా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
సీట్లపై వారం రోజుల వరకు బ్యాక్టీరియాలు
డాక్టర్ సుదీప్తో పలు అధ్యయనాలను ప్రస్తావించారు. సెప్టిక్ ఆత్రిటిస్, ప్రాస్తెటిక్ డివైజ్ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, గ్యాస్ట్రోఎంటెరిటిస్, మెనిన్‌గిటిస్, టాక్సిక్ షాక్ సిండ్రోమ్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులను కలిగించే స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా విమాన సీట్లపై ఏడు రోజుల వరకు జీవించి ఉంటుందని 2015లో ఆబర్న్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారని పేర్కొన్నారు. నీళ్ల విరేచనాలకు కారణమయ్యే ఈ.కోలి అనే మరో బ్యాక్టీరియా ఆర్మ్ రెస్టులపై నాలుగు రోజుల పాటు ఉంటుందని తేలిందన్నారు.
ప్రతి దశలోనూ జాగ్రత్తలు తప్పనిసరి
వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను డాక్టర్ సుదీప్తో ఈ సందర్భంగా సూచించారు. విమాన ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్లాలని, దాన్ని బోర్డింగ్, సీట్లో కూర్చొనే సమయంలో, తర్వాత రాసుకోవాలని అన్నారు. విమానం దిగిన తర్వాత బస్సు లేదా రైలు ప్రయాణంలోనూ ఇది పాటించాలన్నారు. ముఖ్యంగా స్వల్ప దూర దేశీయ ప్రయాణాల్లో విమానంలో పేపర్ కప్పుల్లో ఇచ్చే ఆహారం, నీరు, జ్యూస్‌లను తీసుకోకూడదని సూచించారు. దూర ప్రయాణాల్లో దాహం తీర్చుకొనేందుకు ఒక నీళ్ల బాటిల్ కొనుక్కోవాలన్నారు. కూర్చొనే ముందు సీట్, హ్యాండ్ రెస్ట్లు, ట్రే టేబుల్ ఉపరితలాలను డిస్ఇన్ఫెక్ట్ వైప్స్‌తో శుభ్రం చేసుకోవాలని, ఆహారం, పానీయాల విషయంలో విచక్షణ చూపాలని సూచించారు.