Ashutosh Dixit : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నూతన చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నూతన చీఫ్‌ను చీఫ్ ఆఫ్ ది ఎయిర్స్టాఫ్గా పిలుస్తారు. అశుతోష్ దీక్షిత్ ఈ నెల 31 మధ్యాహ్నం నుంచి ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన 2028 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఉన్న అమర్‌ప్రీత్ సింగ్ అక్టోబర్ 31న రిటైర్ అవుతారు. అదే రోజు అశుతోష్ దీక్షిత్ పదవి చేపడతారు. ప్రస్తుతం ఎయిర్ మార్షల్‌గా ఉన్న దీక్షిత్.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందిస్తున్నారు. 1966లో జన్మించిన ఆయన 1986లో ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. మిరాజ్-2000, జాగ్వార్, తేజస్, హాక్, అవ్రో, కిరణ్ వంటి అనేక యుద్ధ విమానాలను నడిపారు. దాదాపు 3,500 గంటలపాటు ఈ విమానాల్ని నడిపిన అనుభవం ఆయనది. అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 94వ వార్షికోత్సవం ఉంది.
ఈ సమయంలో కొత్త ఎయిర్ స్టాఫ్ చీఫ్‌ను ప్రభుత్వం నియమించడం విశేషం. దీక్షిత్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు 29వ చీఫ్. భారత వాయుసేనలో దీక్షిత్ అనేక హోదాల్లో పని చేశారు. సౌత్ ఎయిర్ కమాండ్‌లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్‌గా, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్స్), అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ (ప్లాన్స్) సహా అనేక బాధ్యతలు నిర్వర్తించారు.