Sitaram Yechury | సీపీఎం నేత సీతారాం ఏచూరి (72) గురువారం తుదిశ్వాస విడిచారు. వైద్య పరిశోధనల కోసం ఆయన మృతదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు దానం చేయాలని కుటుంబీకులు నిర్ణయించారని హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలిపింది. న్యుమోనియా కారణంగా ఆగస్టు 19న సీతారాం ఏచూరి ఎయిమ్స్‌లో చేరారు. గురువారం మధ్యాహ్నం 3.05 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఏచూరి గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయన కామ్రేడ్ సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఢిల్లీలోని ఏకే గోపాలన్ భవన్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం కామ్రేడ్ సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు తరలించి.. ఆయన కోరిక మేరకు వైద్య పరిశోధనల కోసం పార్థీవ దేహాన్ని దానంగా ఇవ్వనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ కార్యాలయం ఒక ప్రకటలో తెలిపింది.
ఇదిలా ఉండగా.. వామపక్ష పార్టీల నేతలు మరణం తర్వాత పార్థీవ దేహాన్ని ఆసుపత్రులకు దానంగా ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సీతారాం ఏచూరి సైతం తన మరణం అనంతరం పార్థీవదేహాన్ని వైద్య పరిశోధనల కోసం దానంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకు ముందు బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భౌతికకాయాన్ని సైతం వైద్య పరిశోధనల కోసం దానం చేశారు. ఆయన పార్థీవదేహాన్ని కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ ఆసుపత్రి అనాటమీ విభాగానికి అప్పగించారు. మార్చి 2006లోనే భట్టాచార్య తన మరణానంతరం దేహాన్ని దానం చేస్తానని ఆయన ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు. అంతకు ముందు సీపీఎం సీనియర్ నేత జ్యోతిబసు సైతం దేహాన్ని దానం చేశారు. 2010లో జ్యోతిబసు మరణం అనంతరం కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి ఆయన పార్థీవ దేహాన్ని అప్పగించారు. అలాగే లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ సైతం శరీరం దానం చేశారు. 2000 సంవత్సరంలో శరీరం దానం చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేయగా.. కుటుంబీకులు ఆసుపత్రికి అప్పగించారు. అలాగే సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్, బెనోయ్ చౌధురి పార్థీవ దేహాలను సైతం కుటుంబీకులు ఆసుపత్రులకు దానం చేశారు.